cloud waterfall: ఇది ప్రపంచ వింతలలో ఒకటి కాదా? చాలెంజ్? .. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఐజ్వాల్ వద్ద మేఘాల జలపాతం
- వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- ప్రపంచం నలుమూలల నుంచి వస్తారన్న మహీంద్రా
- మహీంద్రా ట్వీట్ కు బీఎస్ఎఫ్ ప్రతినిధి స్పందన
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అరుదైన విషయాలను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంటారు. ఆయన్ను ఫాలో అయ్యే వారికి దీని గురించి బాగా తెలుసు. తాజాగా ఆయన మరో అద్భుత విషయాన్ని అందరితో పంచుకున్నారు. మిజోరంలోని ఒక మేఘాల జలపాతం వీడియోను షేర్ చేశారు. ఐజ్వాల్ సమీపంలో మేఘాలు జలపాతం మాదిరిగా పర్వతాల నుంచి దిగువకు వేగంగా ప్రయాణిస్తున్న అద్భుత దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. దీన్ని మేఘాల జలపాతంగా పిలుస్తుంటారు.
ఈ వీడియోతో పాటు ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ పెట్టారు. ‘‘ఐజ్వాల్. ఒక మేఘాల జలపాతం? ప్రపంచ వింతలలో ఇది కూడా ఒకటి కాదా? ప్రపంచ నలుమూలల నుంచి దీన్ని చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు వస్తారని చాలెంజ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు మంచి స్పందన వచ్చింది. బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కృష్ణారావు సైతం స్పందించారు. ఇదే తరహా అద్భుత దృశ్యాలు మేఘాలయలో మాసిన్రమ్, పశ్చిమబెంగాల్లోని సందక్ ఫు వద్ద కనిపిస్తాయంటూ అందుకు సంబంధించిన వీడియోను కృష్ణారావు పంచుకున్నారు. దీంతో మన దేశంలోనే ఉన్న అరుదైన, అద్భుత అందాల గురించి మొదటిసారి లక్షలాది మందికి ట్విట్టర్ వేదికగా తెలిసింది.