Nizamabad District: 16 ఏళ్ల బాలికపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అత్యాచారం.. దావత్ పేరుతో లాడ్జీకి తీసుకెళ్లి అఘాయిత్యం
- చార్మినార్ సమీపంలోని హోటల్లో అత్యాచారం
- నిందితుడు నిజామాబాద్ కు చెందిన షేక్ సాజిద్
- సహకరించిన అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్లపైనా కేసు
- పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు
- టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
టీఆర్ఎస్ నేత ఒకరు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక విశ్వనాథ్‌పేటకు చెందిన టీఆర్ఎస్ నేత షేక్ సాజిద్ తొలుత కౌన్సిలర్‌గా ఎన్నికై ఆ తర్వాత వైస్ చైర్మన్ పదవిని చేపట్టి చిన్న వయసులోనే ఆ పదవిని చేపట్టిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.
ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన సాజిద్ అక్కడికొచ్చిన ఓ బాలికపై కన్ను వేశాుడు. ఆ బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్న సాజిద్.. అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. దీంతో ప్లాన్ వేసిన ఆమె.. తాను నిజామాబాద్ వెళ్తున్నానని, తోడుగా రావాలని కోరి వెంటబెట్టుకు వెళ్లింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో మంచి దావత్ ఉందని, అది చాలా గ్రాండ్‌గా ఉంటుంది రావాలని బలవంతం చేసింది. కారులో వెళ్లి సాయంత్రానికి వచ్చేద్దామని చెప్పింది. తెలిసిన మహిళే కావడంతో నమ్మి సరేనని వెళ్లింది. బాలిక అంగీకరించడంతో అన్నపూర్ణమ్మ ఎవరికో ఫోన్ చేసింది. ఆ వెంటనే కారు రాగా, అందులో హైదరాబాద్ బయలుదేరారు.
బాలికతో కలిసి హైదరాబాద్ చేరుకున్న అన్నపూర్ణమ్మ అప్పటికే చార్మినార్ సమీపంలోని ఓ హోటల్లో బస చేసిన సాజిద్‌కు బాలికను అప్పగించింది. అక్కడతడు బాలికను బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సాజిద్‌పై పోక్సో సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకెళ్లిన అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్లను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్టు గుర్తించారు. వారి ఫోన్ సిగ్నల్స్ చివరిసారి నిర్మల్, ఆ పరిసరాల్లోనే చూపించినట్టు తెలుస్తోంది. మరోవైపు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.