IJF: గౌరవ అధ్యక్షుడి పదవి నుంచి పుతిన్ ను తప్పించిన అంతర్జాతీయ జూడో సమాఖ్య
- రష్యా దుందుడుకు చర్యలు
- ఉక్రెయిన్ పై దాడులు
- 2008 నుంచి ఐజేఎఫ్ కు గౌరవ అధ్యక్షుడిగా పుతిన్
- జూడో రాయబారిగానూ తప్పించిన ఐజేఎఫ్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్లాదిమిర్ పుతిన్ ను హోదా నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు, పుతిన్ జూడో క్రీడాంశానికి ప్రపంచవ్యాప్త రాయబారిగా వ్యవహరిస్తుండగా, ఆ పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్టు ఐజేఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నెలలో రష్యాలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కూడా ఐజేఎఫ్ రద్దు చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఐజేఎఫ్ కు 2008 నుంచి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పుతిన్ కు జూడో మార్షల్ ఆర్ట్ లో ప్రవేశం ఉంది. ఆయన జూడోలో 8వ డాన్ లెవల్ కు ఎదిగారు. 2014లో పుతిన్ కు ఈ మేరకు బెల్ట్ ప్రదానం చేశారు.
అటు, ఫిఫా వరల్డ్ కప్ ప్లేఆఫ్స్ లో రష్యాతో ఆడేందుకు చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు నిరాకరించాయి. అంతేకాదు, రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరగాల్సిన చాంపియన్స్ లీగ్ ఫైనల్ ను యూఈఎఫ్ఏ మరోచోటికి మార్చింది. సెప్టెంబరు 25న జరగాల్సిన రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ పోటీలు కూడా రద్దయ్యాయి.