IIT Kanpur: జూన్ 22 నాటికి కోవిడ్ నాలుగో వేవ్.. ఐఐటీ కాన్పూర్ నిపుణుల అంచనా
- నాలుగు నెలల పాటు ఉంటుంది
- టీకా కార్యక్రమం, కరోనా రకాలు తీవ్రతను నిర్ణయిస్తాయి
- ఆగస్ట్ చివరికి కేసులు గరిష్టానికి
- బూట్ స్ట్రాప్ మెథడాలజీ ఆధారంగా అంచనాలు
కరోనా పని ఇక అయిపోయింది, ఎండెమిక్ (సాధారణ, స్వల్ప లక్షణాలతో కూడిన ఫ్లూ)గా మారిపోయిందన్న అంచనాలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటుండగా.. ఐఐటీ కాన్పూర్ నిపుణులు కాస్త రుచించని అంశాన్ని ప్రకటించారు. కరోనా నాలుగో విడత జూన్ 22 నాటికి విరుచుకుపడుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. ఇది అక్టోబర్ 24 వరకు కొనసాగుతుందన్నది వారి విశ్లేషణ.
ఎంత మంది టీకాలు తీసుకున్నారు, బూస్టర్ డోస్, కొత్త కరోనా మ్యుటెంట్ల (రకాలు)పై నాలుగో విడత కరోనా తీవ్రత ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన పరిశోధకులు తాజాగా ప్రకటించారు. వీరి అంచనాలు మెడిరిక్స్ లో ప్రచురితమయ్యాయి. కరోనా నాలుగో విడత వస్తే కనీసం నాలుగు నెలల పాటు ఉంటుందని.. ఆగస్ట్ 15 నుంచి 31 మధ్య కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకోవచ్చని వీరు అంచనా వేశారు.
కరోనా మూడో విడత గురించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. కొద్ది రోజుల పాటే ఉంటుందని వారు ముందుగా అంచనా వేసినట్టుగానే ఒమిక్రాన్ రెండు నెలల్లోనే ముగిసిపోయింది. కరోనా తొలిసారి 2020 జనవరి 30న వెలుగు చూడగా, అక్కడి నుంచి 936 రోజులకు నాలుగో విడత మొదలవుతుందని వారి గణంకాల ప్రక్రియ తెలియజేస్తోంది. బూట్ స్ట్రాప్ మెథడాలజీ ఆధారంగా ఈ అంచనాలు వేశారు. నిజానికి నాలుగో విడత ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా మొదలు కాలేదు.