Ukraine: చెర్నోబిల్‌లో ఒక్కసారిగా పెరిగిన రేడియేషన్ స్థాయులు.. 20 రెట్లు అధికంగా రేడియేషన్ విడుదల
- చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకున్న రష్యా సైన్యం
- వాహనాల కదలికలతో యాక్టివేట్ అయిన అణువ్యర్థాలు
- ప్రస్తుతానికి ప్రమాదం లేదంటున్న నిపుణులు
- సైనిక చర్య జరిగితే మాత్రం పెను ప్రమాదం తప్పదంటూ హెచ్చరిక
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా ఇప్పటికే అక్కడి చెర్నోబిల్ అణువిద్యుత్ కర్మాగారాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడా విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ స్థాయులు ప్రమాదకరంగా విడుదలవుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. సాధారణం కంటే ఏకంగా 20 రెట్లు అధికంగా రేడియేషన్ విడుదలవుతున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని రాజధాని కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని తన అధీనంలోకి తీసుకుంది.
సాధారణంగా చెర్నోబిల్ చుట్టూ 4 వేల చదరపు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ వాహన సంచారం ఉండదు. రేడియేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో రేడియేషన్ ప్రభావం అంతగా ఉండదు. అయితే, ఇప్పుడా ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకోవడంతో వాహన సంచారం ఎక్కువైంది. ఫలితంగా అణువ్యర్థాలు యాక్టివేట్ అయి ఒక్కసారిగా రేడియేషన్ స్థాయులు పెరిగాయి.
వాహన సంచారం తగ్గితే రేడియేషన్ మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, సైనిక చర్య జరిగితే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని షెఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లెయిర్ కార్క్‌హిల్ తెలిపారు. కాగా, 1986లో చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియేషన్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచంలోనే దీనిని అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెబుతారు. ఈ ఘటన తర్వాత 2000వ సంవత్సరంలో ఇక్కడ అణుకార్యక్రమాన్ని పూర్తిగా మూసివేశారు.