Ukraine: చివరి విద్యార్థిని తరలించే దాకా మిషన్ ఆగదు: కిషన్ రెడ్డి
- విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కిషన్ రెడ్డి చర్చలు
- ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులు భయపడొద్దని సూచన
- అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేరుస్తామని భరోసా
రష్యా మొలుపెట్టిన యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత్‌కు చెందిన చివరి విద్యార్థిని దేశానికి చేర్చేదాకా భారత మిషన్ ఆగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులందరినీ సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృష్టి చేస్తోందని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను దేశానికి తీసుకువచ్చే పనిని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌ను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత విద్యార్థుల తరలింపు, అందుకు చేపడుతున్న చర్యలపై జైశంకర్‌తో కిషన్ రెడ్డి చర్చించారు.
ఆ తర్వాత మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని, భారత్‌లో ఉంటున్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 219 మందితో ఓ విమానం ముంబై బయలుదేరగా.. ఈ రాత్రికే మరో రెండు విమానాలు ఢిల్లీకి రానున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు.