Somu Veerraju: రష్యా - ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించే స్థాయిలో మోదీ ఉండటం గర్వకారణం: సోము వీర్రాజు
- ఏపీ విద్యార్థులు అనేక దేశాల్లో చదువుకుంటున్నారు
- రాబోయే రోజుల్లో విదేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునే రోజులు వస్తాయి
- ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనన్న వీర్రాజు
ఏపీకి చెందిన విద్యార్థులు అనేక దేశాల్లో చదువుకుంటున్నారని... రానున్న రోజుల్లో ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చి చదువుకునే సమయం వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులను వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని చెప్పారు. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే స్థాయిలో ప్రధాని మోదీ ఉండటం మనకు గర్వకారణమని అన్నారు.
జగనన్న పేరుతో కడుతున్న ఇళ్లకు మోదీ రూ. 32 వేల కోట్లు ఇస్తున్నారని... ఇళ్లకు స్థలం ఇచ్చామనే సాకుతో జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని వీర్రాజు విమర్శించారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు నరేగా కింద రూ. 35 వేల కోట్లు, జగన్ సీఎం అయిన తర్వాత రూ. 37 వేల కోట్లు ఇచ్చారని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ. 3 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని చెప్పారు.