Indian Students: 24 గంటల నుంచి ఆహారం, నీరు లేకుండానే బంకర్లలో ఉన్నాం: కంటతడి పెట్టిస్తున్న భారతీయ విద్యార్థినుల వీడియో!

Send Help Indian Students Video From Ukraine

  • ఉక్రెయిన్ లో బంకర్లలో తలదాచుకున్న భారతీయ విద్యార్థులు
  • బంకర్లలో ఉండటం కష్టతరంగా ఉందని వ్యాఖ్య 
  • వీలైనంత త్వరగా సాయం అందించాలని విన్నపం

ఉక్రెయిన్ సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాది మంది భారతీయుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందరో భారతీయ విద్యార్థులు అక్కడ వైద్య, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. రష్యా బలగాల దాడుల నేపథ్యంలో వీరిలో చాలా మంది విద్యార్థులు బంకర్లలోకి వెళ్లిపోయారు. బంకర్లలో వారి దుస్థితి వర్ణానాతీతంగా ఉంది. 

బెంగళూరు నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు పోస్ట్ చేసిన వీడియో అందరికీ కంటతడి తెప్పిస్తోంది. బంకర్ లో తాము అనుభవిస్తున్న ఆవేదనను వారు వీడియోలో వ్యక్తపరిచారు. తమను కాపాడాలని ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీని వారు వేడుకుంటున్నారు. భారత అధికారుల నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని వాపోయారు.  

మేఘన అనే విద్యార్థిని మాట్లాడుతూ, గత 24 గంటల నుంచి ఆహారం, తాగునీరు లేకుండా ఉన్నామని చెప్పింది. తమ కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బంకర్లలో ఉండటం చాలా కష్టంగా ఉందని తెలిపింది. వీలైనంత త్వరగా తమకు సాయం చేయాలని వేడుకుంది.  

ఈ వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. మన విద్యార్థులు బంకర్లలో ఉన్న సన్నివేశాలు కలచివేస్తున్నాయని రాహుల్ అన్నారు. 'రష్యా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్న తూర్పు ఉక్రెయిన్ లో ఎక్కువ మంది మన విద్యార్థులు చిక్కుకుపోయారు. వారి కుటుంబసభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారిని తక్షణమే వెనక్కి తీసుకొచ్చేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' అని రాహుల్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News