Indian Students: కాలినడకన పోలెండ్ సరిహద్దులకు చేరుకున్న 40 మంది భారత విద్యార్థులు

Indian students reached Poland borders by walk

  • ఉక్రెయిన్ పొరుగు దేశాలకు తరలివెళుతున్న భారత విద్యార్థులు
  • ల్వీవ్ నుంచి ఓ బృందం పోలెండ్ సరిహద్దుకు పయనం
  • వర్సిటీ బస్సులో 70 కిలోమీటర్ల ప్రయాణం
  • 8 కిమీ నడిచి సరిహద్దుకు చేరుకున్న వైనం

యుద్ధం గుప్పిట్లో చిక్కుకున్న ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా, 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో వారు స్వదేశం చేరేందుకు ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలో, వారికి యూనివర్సిటీ యాజమాన్యం కొద్దిమేర సహకరించింది. భారత విద్యార్థులను యూనివర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చింది. పోలెండ్ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టింది. ఆపై వారందరూ సరిహద్దు వద్దకు కాలినడకన చేరుకున్నారు.

కాగా, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.

ప్రస్తుతం రష్యా తన సరిహద్దుకు సమీపంలో తూర్పు ఉక్రెయిన్ భాగంలోనే దాడులు చేస్తోంది. దాంతో పశ్చిమ ఉక్రెయిన్ లో కొద్దిమేర సాధారణ వాతావరణం కనిపిస్తోంది. భారత్ కు చెందిన మరో విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రుమేనియా సరిహద్దుల వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది.

భారత కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల ద్వారా భారత విద్యార్థులను స్వదేశానికి తరలించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇవాళ బుచారెస్ట్ కు రెండు చార్టర్డ్ విమానాలు బయల్దేరనుండగా, రేపు బుడాపెస్ట్ కు ఓ విమానం బయల్దేరనుంది.

Indian Students
Poland Border
Lviv
Ukraine
Russia
  • Loading...

More Telugu News