Russia: ఉక్రెయిన్ సైనికులుగా మారు వేషాల్లో రష్యా సైనికులు.. యూకే విమానాలపై రష్యా నిషేధం
- కీవ్ ను ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తున్న రష్యా బలగాలు
- మారు వేషాల్లో కీవ్ నగరంలోకి ప్రవేశించిన రష్యా సైన్యం
- బ్రిటన్ పై ఆంక్షలు విధించిన రష్యా
ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకునే దిశగా రష్యా బలగాలు చొచ్చుకుపోతున్నాయి. రేపటిలోగా కీవ్ రష్యా హస్తగతమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కీవ్ దిశగా వేగంగా కదులుతున్న నేపథ్యంలో... కొందరు రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికుల యూనిఫామ్ లు ధరించి మారువేషాల్లో కీవ్ నగరంలోకి ప్రవేశించారు. ఈ మేరకు ఉక్రెయిన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కీవ్ లోని ప్రభుత్వ క్వార్టర్స్ పై రష్యా సైన్యం కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం.
మరోవైపు రష్యాపై బ్రిటన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆంక్షలు విధించారు. తమ గగనతలంపై బ్రిటన్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించారు. మరోవైపు యుద్ధంలో ఇప్పటి వరకు 450 మంది రష్యన్ సైనికులు మృతి చెందినట్టు బ్రిటన్ అంచనా వేస్తోంది.