Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల గురించి సుప్రీంకోర్టులో న్యాయ‌వాది వ్యాజ్యం

petition in supremecourt on indians in ukrain

  • వారిని వెంట‌నే భార‌త్ తీసుకురావాలి
  • అది కేంద్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌
  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించాలి
  • ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరిన పిటిష‌నర్

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తుండ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి కోసం కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున భార‌తీయులూ చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే. వారిని తిరిగి భార‌త్‌కి తీసుకువ‌చ్చేలా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో విశాల్ తివారి అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.  

అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించేలా చూడాల‌ని కోరారు. తన పిటిషన్‌పై సత్వరమే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భీక‌ర‌ దాడి చేస్తోంద‌ని, ఉక్రెయిన్‌లోని భారతీయులు, విద్యార్థులకు అవసరమైన వస్తువులను సరఫరా చేయాలని ఆదేశించాలని కోరారు. భారతీయులను స్వదేశానికి రప్పించడం భారత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

భార‌త్‌లోని ప్రతి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నారని ఆయ‌న గుర్తు చేశారు. వారు ఉక్రెయిన్‌లో చిక్కుకోవ‌డంతో వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం కోసం అర్థిస్తున్నారని చెప్పారు. దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడాల్సిన‌ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

రవాణా సదుపాయాలు లేని సమయంలో నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత అని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలను చేపట్టాలని ఆయ‌న చెప్పారు. కాగా, ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసి, ఉక్రెయిన్‌లోని త‌మ విద్యార్థుల‌ను తిరిగి ర‌ప్పించాల‌ని విజ్ఞప్తి చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News