Russia: రష్యా దాడులు చేసింది ఈ నగరాలపైనే
- కీవ్ ను ఇప్పటికే ఆక్రమించిన రష్యా బలగాలు
- రెండో అతిపెద్ద సిటీ ఖార్కివ్ పైనా దాడి
- రష్యా సిటీ బెల్గొరోడ్ లోనూ దాడి జరిగినట్టు కథనాలు
గురువారం తెల్లవారుతుండగానే ఉక్రెయిన్ ప్రజలు బాంబుల మోతతో నిద్ర లేచారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని చాలా నగరాలపై బాంబులతో విరుచుకుపడుతూ ఆక్రమించేశాయి.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పైనే రష్యా బలగాలు మొదట దాడి చేశాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించాయి. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు.. రాజధానిలోని బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు పేర్కొన్నారు.
ఖార్కివ్: ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నూ టార్గెట్ చేస్తూ రష్యా దాడులకు పాల్పడింది.
క్రమటోర్స్క్: డొనెట్స్క్ కు 120 కిలోమీటర్ల దూరంలోని ఈ నగరంలోనూ రెండు భారీ పేలుళ్లు జరిగినట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు.
దినిప్రో: ఈ సిటీలో పలు బాంబు దాడులు జరిగినట్టు ఓ స్థానికుడు చెప్పారు.
మరియపోల్: సిటీకి తూర్పు ప్రాంతంలో రెండు మూడు బాంబు పేలుళ్ల మోతలు వినిపించాయంటూ కొందరు స్థానికులు తెలిపారు.
ఒడెస్సా: నల్ల సముద్రం పోర్టు సిటీ అయిన ఇక్కడ 20 నిమిషాల వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
జపోరిఝియా: ఉక్రెయిన్ దక్షిణాది నగరమైన ఇక్కడ ఓ భారీ పేలుడు సంభవించింది.
లెవివ్: లెవివ్ పై రష్యా బలగాలు వైమానిక దాడులు చేశాయి. ఇవాళ ఉదయం 7.45 గంటలకు దాడులకు తెగబడ్డాయి.
ఇవి కాకుండా రష్యాలోని బెల్గొరోడ్ నగరంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చెబుతున్నారు.