Malayalam: మలయాళ సీనియర్ సినీ నటి లలిత ఇకలేరు
- కేపీఏసీ లలితగా పాప్యులర్
- 550కు పైగా చిత్రాల్లో నటించిన అనుభవం
- సీరియల్స్ తోనూ అలరించిన లలిత
- ఎన్నో జాతీయ, రాష్ట స్థాయి ఫిల్మ్ అవార్డులు
మలయాళ చిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలం సేవలు అందించిన సీనియర్ నటి లలిత (74) అనారోగ్యంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. గత నవంబర్ లో పలు ఆరోగ్య సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం పరిస్థితి మెరుగుపడడంతో కొచ్చిలోని కుమారుడు సిద్ధార్థ ఇంటికి వెళ్లిపోయారు. లలిత మృతితో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
1969లో కూటు కుడుంబం సినిమాలో సరస్వతి పాత్రతో లలిత సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. పదేళ్ల వయసులోనే నటన మొదలు పెట్టారు. కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ)లో చేరారు. ఇది కేరళకు చెందిన ప్రముఖ డ్రామా ట్రూప్. అందుకనే ఆమె కేపీఏసీ లలితగా ఎక్కువ మందికి పరిచయం. మొత్తం 550కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ‘వరానే అవశ్యమండు’ సీరియల్ లో ఆకాశవాణి పాత్రలోనూ నటించారు.
రెండు పర్యాయాలు నేషనల్ ఫిల్మ్ అవార్డులతోపాటు, ఎన్నో చిత్రాలకు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు అన్ని తరాలకు వారధిగా నిలిచి సెలవు తీసుకున్నారు.