Nara Lokesh: ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్ట్ చేస్తారా?: నారా లోకేశ్

Nara Lokesh take a swipe at AP CM YS Jagan

  • ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ ధ్వజం
  • నిరసన హక్కును హరించడం మానుకోవాలని హితవు
  • అంగన్ వాడీ, ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టీకరణ

అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యమం అణచివేత ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

అంగన్ వాడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవు మంజూరు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రేషన్ కార్డులు తొలగించి సంక్షేమ పథకాలు అందకుండా చేయొద్దని, ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం నేరమా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

కరోనా సమయంలో ఆశా వర్కర్లు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించారని, వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన ప్రభుత్వం వారికి కనీసం మాస్కులు, చేతి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం కచ్చితంగా వివక్షేనని తెలిపారు. కరోనా వైద్య బృందాలతో పాటు వెళ్లి విధి నిర్వహణలో కరోనా సోకి మరణించిన ఆశా కార్యకర్తలకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం దారుణమని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కును నిర్బంధాల ద్వారా హరించడం జగన్ మానుకోవాలని హితవు పలికారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News