Dwaraka Tirumalarao: ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన ఉంది: ఏపీ ఆర్టీసీ ఎండీ
- విలీనం తర్వాత నష్టాలు తగ్గాయన్న ఎండీ
- కొద్దిమేర అప్పులు తీర్చేశామని వెల్లడి
- కారుణ్య నియామకాలు చేపడతామని వివరణ
- సీఎం ఆదేశాలు ఇచ్చారన్న ద్వారకా తిరుమలరావు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత సంస్థకు నష్టాలు తగ్గాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సీసీఎస్ కు రూ.240 కోట్లు, పీపీఎఫ్ కు రూ.640 కోట్ల అప్పులు కూడా తీర్చేశామని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. ఇది పరిశీలనలో ఉందని తెలిపారు.
కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కార్మికులు సమ్మెకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని స్పష్టం చేశారు. కార్మికులు నోటీసులో పేర్కొన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులు క్యాడర్ ఫిక్సేషన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కారుణ్య నియామకాలపైనా ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, 1,500 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 2015 నుంచి 2019 వరకు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ కూడా ఆదేశాలు ఇచ్చారని ఆర్టీసీ ఎండీ తెలిపారు.