Ram Gopal Varma: 'భీమ్లా నాయక్' ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

Ram Gopal Varma comments on Bheemla Nayak trailer
  • రానాను ప్రమోట్ చేయడానికి పవన్ ను ఉపయోగించుకున్నట్టున్నారన్న వర్మ
  • ఈ సినిమాకు డేనియల్ శేఖర్ అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్య
  • హిందీ ప్రేక్షకులు రానాను హీరో అనుకునే అవకాశం ఉందంటూ సెటైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ ను నిన్న విడుదల చేశారు. ఈ ట్రైలర్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కల్యాణ్ ను ఉపయోగించుకున్నారేమోనని అనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ అభిమానిగా తాను చాలా బాధపడ్డానని చెప్పారు.

ఈ సినిమాకు 'భీమ్లా నాయక్' అనే టైటిల్ కాకుండా 'డేనియల్ శేఖర్' అనే టైటిల్ పెట్టాల్సిందని అన్నారు. పవన్ కల్యాణ్ ట్రైలర్ అయితే రానా పూర్తి సినిమా అని చెప్పారు. హిందీ ప్రేక్షకులకు పవన్ కల్యాణ్ కంటే 'బాహుబలి' సినిమా ద్వారా రానానే ఎక్కువగా తెలుసని అన్నారు. అందువల్ల ఈ చిత్రంలో రానా హీరో, పవన్ విలన్ అని హిందీ ప్రేక్షకులు పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కు అత్యంత సన్నిహితులైన మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం తనను షాక్ కు గురి చేసిందని ఎద్దేవా చేశారు.
Ram Gopal Varma
Pawan Kalyan
Rana Daggubati
Bheemla Nayak Movie
Trailer
Tollywood

More Telugu News