IDFC First Bank: కారు డ్రైవర్, ఇంటి పనిమనిషికి రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు ఎండీ
- మొత్తంగా ఐదుగురికి షేర్లను పంచేసిన వైద్యనాథన్
- తనతో ఏ సంబంధమూ లేని వారికి గతంలోనూ షేర్ల పంపకం
- రుక్మిణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2 లక్షల షేర్లు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ. 3.95 కోట్ల విలువైన తన 9 లక్షల షేర్లను తన ట్రైనర్, ఇంటి పనిమనిషి, కారు డ్రైవర్ సహా ఐదుగురికి పంచిపెట్టేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఈ ఐదుగురితో ఆయనకు ఎలాంటి బంధుత్వం లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తనతో ఎలాంటి సంబంధం లేని కొందరికి గతంలోనూ ఆయన కొన్ని షేర్లు ఇవ్వడం విశేషం.
వైద్యనాథన్ తన 9 లక్షల ఈక్విటీ షేర్లను ఐదుగురికి బహుమానంగా ఇచ్చినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తెలిపింది. 3 లక్షల షేర్లను తన ట్రైనర్ రమేశ్ రాజుకు, ఇంటి పనిచేసే ప్రంజల్ నర్వేకర్, కారు డ్రైవర్ అల్గర్‌స్వామి సి మునపర్‌లకు చెరో 2 లక్షల షేర్లు, ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ అయిన దీపక్ పథారే, ఇంటి పనిమనిషి సంతోష్ జొగాలేకు చెరో లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమానంగా ఇచ్చేశారు.
నిన్నటి క్లోజింగ్ ధర ప్రకారం బీఎస్ఈలో ఐడీఎఫ్‌సీ షేర్ ఒక్కోటి రూ. 43.90గా ఉంది. ఈ లెక్కన వైద్యనాథన్ బహుమతిగా పంచిపెట్టిన 9 లక్షల షేర్ల విలువ రూ. 3,95,10,000. కాగా, రుక్మిణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2 లక్షల షేర్లను ఇచ్చినట్టు ఐడీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. మొత్తంగా 11 లక్షల ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు బ్యాంకు పేర్కొంది.