Mekapati Goutham Reddy: రోజూ ఉదయం కాఫీ తాగేవారు.. ఈరోజు కాఫీ అడగలేదు: గౌతమ్ రెడ్డి ఇంట్లో వంటమనిషి
- నిన్న తెల్లవారుజామున దుబాయ్ నుంచి వచ్చారు
- ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఛాతీనొప్పి వస్తోందని కుప్పకూలిపోయారు
- వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు అసలు ఏం జరిగిందో గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న కొమురయ్య వివరించారు.
కొమురయ్య చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాదుకు గౌతమ్ రెడ్డి వచ్చారు. నిన్న ఇంట్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. ఫంక్షన్ ఉంది అని చెప్పి సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లారు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి, ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గౌతమ్ రెడ్డికి ప్రతిరోజు ఉదయం కాఫీ తాగే అలవాటు ఉందని... అయితే, ఈరోజు కాఫీ కావాలని ఆయన అడగలేదని కొమురయ్య తెలిపాడు.