mekapati gowtham reddy: హైదరాబాద్ చేరుకున్న జగన్.. మేకపాటికి కన్నీటి నివాళి
![Jagan reached HyderabadTearful tribute to Mekapati](https://imgd.ap7am.com/thumbnail/cr-20220221tn621359cba3773.jpg)
- సతీమణితో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పయనం
- బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
- నేరుగా జూబ్లీహిల్స్‌లోని మేకపాటి ఇంటికి
- గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగం
- జగన్‌ను చూడగానే బోరుమన్న గౌతమ్‌రెడ్డి కుటుంబం
ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో తెలుగు నేలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజకీయాలను పక్కనపెట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలు మేకపాటికి నివాళి అర్పించేందుకు తరలివస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కాసేపటి క్రితం సతీసమేతంగా హైదరాబాద్ చేరుకుని నేరుగా మేకపాటి నివాసానికి వెళ్లారు. బెంగళూరులో ఉన్న తన సతీమణిని తీసుకుని హైదరాబాద్ వచ్చిన జగన్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
జగన్‌ను చూడగానే గౌతమ్ రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతమ్ రెడ్డి సతీమణి, ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి కూడా జగన్‌ను చూడగానే.. బోరున విలపించారు. జగన్‌తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలగిన క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు జగన్ కనిపించగానే.. ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను చూసిన గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని చూసిన జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి పార్దివ దేహం పక్కనే కుర్చీలో కూర్చున్న జగన్ కన్నీరు పెట్టుకున్నారు. తన పక్కనే ఉన్న రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు.