India: తప్పనిసరి అయితేనే ఉక్రెయిన్ లో ఉండండి... లేకపోతే వెంటనే వెళ్లిపొండి: భారతీయులకు కేంద్రం స్పష్టీకరణ
- ఉక్రెయిన్ పై అస్త్రాలను ఎక్కుపెట్టిన రష్యా
- నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
- ఏ క్షణాన అయినా విరుచుకుపడనున్న రష్యా సేనలు
- భారతీయులను అప్రమత్తం చేసిన కేంద్రం
ఉక్రెయిన్ పై దాడికి రష్యా సర్వసన్నద్ధంగా ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి అయితేనే ఉక్రెయిన్ లో ఉండాలని, లేకపోతే వెంటనే ఆ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. విద్యార్థులు సహా భారతీయులు అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది.
ముఖ్యంగా, విద్యార్థులు స్టూడెంట్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండాలని, తాజా సమాచారం కోసం భారత ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించింది. ఉక్రెయిన్ లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, ఏ క్షణాన అయినా రష్యా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది.