Pawan Kalyan: మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదు: వైసీపీ నేతలపై పవన్ ఫైర్

Pawan Kalyan fires in YCP

  • నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • జీవో నెం.217పై విమర్శలు
  • ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు

నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనను బెదిరించాలని చూసే నాయకులకు ఒకటే చెబుతున్నా... మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదు అని స్పష్టం చేశారు. సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం అని, బలహీనత కాదని ఉద్ఘాటించారు. గొడవలు పెట్టుకునేందుకు చాలా ఆలోచిస్తామని అన్నారు.

"పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తాను. కార్యకర్తలను ఇబ్బందుల పాల్జేసే నిర్ణయాలు తీసుకోను. మా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, ఇదే విధంగా హింసిస్తే రోడ్డుపై ఏ స్థాయికైనా దిగి పోరాడతా" అని వెల్లడించారు.

మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని వెల్లడించారు.  మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసన్నారు.

"జనసేనకు గనుక ఒక్క పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ జీవో 217ని ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసి ఉండేది కాదు... చించేసేవాళ్లం!" అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ జీవోతో లక్షలమంది పొట్టకొడుతున్న వైసీపీ నేతలు జీవో ప్రతులను చించివేసిన తనపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.

ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ఉద్ఘాటించారు. దేశంలో అంధకారం తొలగిపోవాలంటే సాహసం ఉండాలని, అలాంటి సాహసం ఉన్నవాళ్లే మత్స్యకారులు అని, మత్స్యకారుల కులాలు ఉత్పత్తి కులాలు అని వివరించారు.

  • Loading...

More Telugu News