Sonu Sood: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: సోనూ సూద్ ఇంటి నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవన్న అధికారులు

Sonu Sood house arrest in Moga

  • పంజాబ్ లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • పోలింగ్ బూత్ లో ప్రవేశిస్తున్నాడంటూ సోనూపై ఫిర్యాదు
  • సోనూ సూద్ కారును స్వాధీనం చేసుకున్న అధికారులు

పంజాబ్ లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మోగా నియోజకవర్గంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. అయితే, మోగాలో ఓ పోలింగ్ బూత్ లోకి సోనూ సూద్ ప్రవేశించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. సోనూ సూద్ పై శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జీందర్ సింగ్ అలియాస్ మఖాన్ బ్రార్ ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు.

సోనూ సూద్ ను నిలువరించిన అధికారులు అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఇంటికి తరలించారు. ఇంటి నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మోగా జిల్లా పీఆర్ఓ ప్రభ్ దీప్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ మోగా ఎస్పీని జిల్లా మేజిస్ట్రేట్ హరీశ్ నయ్యర్ ఆదేశించారు. నయ్యర్ మాట్లాడుతూ, సోనూ సూద్ ఒక బూత్ నుంచి మరొక బూత్ కు వెళుతుండడాన్ని పలు రాజకీయ పార్టీలు ఆక్షేపించాయని తెలిపారు.

అయితే, ఈ వ్యవహారంపై సోనూ సూద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తెలిపారు. ప్రత్యేకించి ఓ పార్టీకి గానీ, ఓ అభ్యర్థికి గానీ ఓటేయాలని తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను సందర్శించడానికి వెళ్లానని సోనూ సూద్ వివరణ ఇచ్చారు.

అంతేకాదు, మోగా నియోజకవర్గంలో ఇతర అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈసీ తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News