Pavan Kalyan: 'భీమ్లా నాయక్' నుంచి ట్రైలర్ రెడీ!
- 'భీమ్లా నాయక్' గా పవన్ కల్యాణ్
- ఈ నెల 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- అదే రోజున ట్రైలర్ రిలీజ్
- 25వ తేదీన సినిమా విడుదల
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను రూపొందించాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా నుంచి అదే రోజున ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ఒక ప్రకటన చేశారు. మరి 'ప్రీ రిలీజ్ ఈవెంట్' వేదికపై ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారో .. అంతకంటే ముందుగానే వదులుతారో చూడాలి. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. అంతేకాదు ఇప్పటికే పాప్యులర్ అయిన టైటిల్ సాంగ్ ను ఆయనే రాశారు.
పవన్ తనకి ఎంతో ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. మరో ప్రధానమైన పాత్రను రానా పోషించారు. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికలుగా నిత్యామీనన్ - సంయుక్త మీనన్ కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.