Kishan Reddy: హైదరాబాదులో సంప్రదాయ వైద్య కేంద్రం... సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
- భారత్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్
- ఏర్పాటుకు ముందుకొచ్చిన డబ్ల్యూహెచ్ఓ
- హైదరాబాదు వైపు చూస్తున్న కేంద్ర ఆయుష్ శాఖ
- భూమిని గుర్తించాలని సీఎం కేసీఆర్ ను కోరిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. భారత్ లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముందుకొచ్చిందని వెల్లడించారు. ఈ కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భావిస్తోందని తెలిపారు. ఈ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుతో తెలంగాణకు, హైదరాబాదుకు మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని, ఈ కేంద్రం ఏర్పాటు కోసం సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమి అవసరమవుతుందని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా గుర్తించాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.