TTD: శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ... ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- తిరుమల అన్నమయ్య భవన్ లో భేటీ
- ఆర్జిత సేవలు రెండేళ్ల కిందట నిలిపివేశారన్న వైవీ
- మళ్లీ ప్రారంభిస్తున్నట్టు వెల్లడి
తిరుమల అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం, ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల కిందట నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్టు వివరించారు.
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఉన్న ఆర్జిత సేవల ధరలు పాతికేళ్ల కిందట నిర్ణయించినవని వెల్లడించారు. కాగా, నేటి సమావేశంలో సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగింది. సేవా టికెట్ల ధర పెంపుపై ధర్మకర్తల మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.