Two-Wheelers: నాలుగేళ్ల లోపు చిన్నారులతో బైక్‌పై వెళ్తే సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి: నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
- మోటారు వాహనాల చట్టం-2022లో సవరణలు
- చిన్నారుల రక్షణకు మరిన్ని చర్యలు
- వచ్చే ఏడాది నుంచి అమలు
మోటారు వాహనాల చట్టం-2022లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సవరణలు చేసింది. ఇకపై 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులను బైక్‌పై తీసుకెళ్లే సమయంలో మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లైఫ్ జాకెట్ (సేఫ్టీ బెల్ట్) లాంటిది ఏర్పాటు చేయాలి. ఇందులో చిన్నారిని కూర్చోబెట్టి దానిని బైక్ నడిపే వ్యక్తి నడుముకు కట్టుకోవాల్సి ఉంటుంది. పిల్లల వయసును బట్టి దీనిని సరిచేసుకునే వెసులుబాటు కూడా ఉండాలి. 30 కేజీల బరువు వరకు అది తట్టుకునేలా ఉండాలి.
అలాగే, వెనక కూర్చునే పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి. నాలుగేళ్లలోపు చిన్నారులతో వెళ్తున్నప్పుడు ద్విచక్ర వాహన వేగం 40 కిలోమీటర్లకు మించకూడదని ప్రభుత్వం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. అలాగే, నైట్రోజన్, ఆక్సిజన్, వివిధ రకాల వాయువులు, ప్రమాదకర వస్తువులను రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఉండాలని కూడా రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై సలహాలు, సూచనలను నెలలోపు పంపించాలని కోరింది.