Centre: నిత్యావసరాల ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలు.. కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా తగ్గింపు
- పెసలపై దిగుమతి సుంకం సున్నా
- ఆస్ట్రేలియా నుంచి వచ్చే దిగుమతులకు వర్తింపు
- అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకం తగ్గింపు
- ముడి పామాయిల్ పై 5 శాతానికి తగ్గింపు
పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆస్ట్రేలియా, కెనడా నుంచి దిగుమతి అయ్యే పెసలపై సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది.
ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనివల్ల దేశీయంగా పామాయిల్ రిఫైనరీ పెరగడానికి వీలు కలుగుతుంది. గతేడాది నవంబర్ లో వంట నూనెల ధరలు కొంత తగ్గినట్టే తగ్గి.. ఆ తర్వాత నుంచి మళ్లీ పెరగడం మొదలయ్యాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం), ఇండోనేషియాలో పామాయిల్ ఎగుమతి విధానాన్ని సవరించడం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
ఇప్పటి వరకు ముడి పామాయిల్ 50 శాతం, రిఫైన్డ్ (శుద్ది చేసిన) 50 శాతం చొప్పున దిగుమతులు ఉండేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముడి పామాయిల్ ఎక్కువ దిగుమతి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.