COVID: కోవిడ్ కథ ముగిసింది: లాన్సెట్ మెడికల్ జర్నల్
- ఎండెమిక్ గా మారింది
- ఇది అంతమైపోయినట్టు కాదు
- మనతోనే ఎప్పటికీ ఉంటుంది
- సీజనల్ ఫ్లూ మాదిరిగా కొనసాగుతుందని అంచనా
ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే కబురును లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రిక తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి ఎండెమిక్ మారినట్టు తెలిపింది. ఈ మేరకు తన పత్రికా సంపాదకీయాన్ని ప్రచురించింది. వైద్య రంగానికి సంబంధించి లాన్సెట్ ను విశ్వసనీయమైన పత్రికగా చెబుతారు.
కరోనా ఎండెమిక్ గా మారినట్టు సంపాదకీయంలో రాసింది. ఎండెమిక్ అంటే స్థానికంగా ఉండే అంటు వ్యాధి అని అర్థం. దీంతో కరోనా ఒక మహమ్మారిగా విరుచుకుపడే శక్తిని కోల్పోయినట్టు. స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురి చేసే శక్తి మాత్రమే ఉంటుంది. కరోనా ఎండెమిక్ అయినప్పటికీ, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని లాన్సెట్ తెలిపింది. సీజనల్ ఫ్లూ (రుతువులు మారిన సందర్భాల్లో వచ్చే జలుబు)గా కొనసాగుతుందని అభిప్రాయపడింది.
ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడినట్టు లాన్సెట్ అంచనా వేసింది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తు చేసింది. ఏటా ఎంతో మంది మరణాలకు కారణమవుతున్న ఇతర సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులపైనా పరిశోధన చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.