Jason Holder: గతేడాది రూ.75 లక్షలు పలికాడు... నేటి వేలంలో రూ.8.75 కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ ఆల్ రౌండర్
- ఐపీఎల్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం
- జాక్ పాట్ కొట్టిన జాసన్ హోల్డర్
- హోల్డర్ కోసం రాయల్స్, ముంబయి, లక్నో పోటీ
- హోల్డర్ ను దక్కించుకున్న లక్నో ఫ్రాంచైజీ
ఐపీఎల్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఉత్సాహంగా సాగుతోంది. కొందరు సీనియర్ ఆటగాళ్లను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా, మరికొందరు ఆటగాళ్లు మాత్రం వేలంలో భారీ ధర పలికారు. ఈసారి జాక్ పాట్ కొట్టిన ఆటగాళ్లలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ కూడా ఉన్నాడు.
హోల్డర్ గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ హోల్డర్ ను కేవలం రూ.75 లక్షలతో సొంతం చేసుకుంది. ఈసారి వేలానికి వచ్చిన హోల్డర్ కోట్లు కొల్లగొట్టాడు. ఇవాళ్టి వేలంలో ఈ పొడగరి ఆల్ రౌండర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడగా, చివరికి రూ.8.75 కోట్లతో అతడిని కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఎగరేసుకెళ్లింది.
బంతితోనూ, బ్యాట్ తోనూ సత్తా చాటే హోల్డర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ కూడా ఆసక్తి చూపించాయి. చివరి వరకు పోటీపడినా లక్నో సూపర్ జెయింట్స్ అతడిని అదిరిపోయే ధరకు కైవసం చేసుకుంది. హోల్డర్ ఐపీఎల్ లో 26 మ్యాచ్ లు ఆడి 35 వికెట్లు తీశాడు. టీమిండియాతో తాజా వన్డే సిరీస్ లోనూ హోల్డర్ రాణించాడు.
కాగా, ఆసీస్ ఆటగాడు, సన్ రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ కు ఈ వేలంలో రూ.6.25 కోట్ల ధర పలికింది. వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. దీనిపై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ సోషల్ మీడియాలో కాస్తంత హాస్య ధోరణిలో స్పందించాడు. మరీ ఇంత తక్కువ ధరా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు.
"ఢిల్లీ ప్రజలు బేరం ఆడడంలో మొనగాళ్లని అందరికీ తెలిసిందే. కానీ వార్నర్ అంతటివాడ్ని కేవలం రూ.6.25 కోట్లకు కొనుగోలు చేయడం సరోజిని నగర్ మార్కెట్లో బేరం ఆడినట్టుగానే అనిపించింది" అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు.