Kesineni Nani: మేము జైలుకెళ్లేందుకు సిద్ధం.. జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు: కేశినేని నాని, గద్దె రామ్మోహన్

Kesineni Nani and Gadde Rammohan fires on Jagan

  • అశోక్ బాబును పరామర్శించిన కేశినేని, గద్దె, మంతెన, బచ్చుల
  • జగన్ రాక్షసత్వం బయటపడిందన్న కేశినేని నాని
  • అశోక్ ను అరెస్ట్ చేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్న గద్దె రామ్మోహన్

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణ రాజు, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అశోక్ బాబును అరెస్ట్ చేయించడం ద్వారా జగన్ రెడ్డి రాక్షసత్వం మరోసారి బయటపడిందని కేశినేని నాని అన్నారు. ఎమ్మెల్సీ అఫిడవిట్ లో తన విద్యార్హత ఇంటర్ అని అశోక్ బాబు పేర్కొన్నారని చెప్పారు. సర్వీస్ బుక్ లో టైపింగ్ తప్పిదంలో జరిగిన పొరపాటును ఆధారంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

ఎన్ని కేసులు పెట్టుకున్నా తాము భయపడబోమని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లినట్టు ప్రజా సమస్యలపై తాము కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. జైలుకెళ్తున్న టీడీపీ నేతలెవరూ ప్రజా సొమ్మును కొల్లగొట్టి పోవడం లేదని అన్నారు. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు.

గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని అన్నారు. అశోక్ బాబును అరెస్ట్ చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ హక్కుల కోసం అశోక్ బాబు చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరని అన్నారు.

Kesineni Nani
Gadde Rammohan
Ashok Babu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News