Ajinkya Rahane: మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన రహానే
- ఇంట్లో కూర్చుంటే పరుగులు సాధించలేం
- దేశవాళీ, రంజీ మ్యాచ్‌లు లేనప్పుడు ఆ ప్రభావం ఫామ్‌పై పడుతుంది
- రోహిత్‌శర్మకు సారథ్యం పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం
- నా చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించను
ఆస్ట్రేలియాలో తాను సాధించిన విజయాన్ని మరొకరు తన ఖాతాలో వేసుకున్నారంటూ పరోక్షంగా రవిశాస్త్రిపై విరుచుకుపడిన అజింక్య రహానే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో తాను రాణిస్తున్న సమయంలోనే జట్టు నుంచి అకస్మాత్తుగా తప్పించారని ఆరోపించాడు. ఫలితంగా రెగ్యులర్ క్రికెట్‌కు దూరమయ్యానని, అది తన ఫామ్‌పై ప్రభావం చూపించిందని అన్నాడు.
రెండుమూడేళ్లుగా ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు, రంజీ ట్రోఫీ, దేశవాళీ మ్యాచ్‌లు లేనప్పుడు ఆ ప్రభావం ఫామ్‌పై తప్పకుండా పడుతుందన్నాడు. ఇంట్లో కూర్చుంటే పరుగులు రావన్నాడు. నెట్ సెషన్స్‌లో పాల్గొన్నంత మాత్రాన ఆత్మవిశ్వాసం రాదన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నాడు. ఎన్ని పరుగులు సాధిస్తే అంత ఆత్మవిశ్వాసం వస్తుందని పేర్కొన్నాడు. వన్డేల్లో బాగా ఆడుతున్నప్పుడే తనను జట్టు నుంచి తప్పించారని, అయితే, ఈ విషయంలో ఇంతకుమించి లోతులకు వెళ్లాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.
2014 నుంచి 2017 వరకు వన్డేలు, టెస్టుల్లో చక్కగా ఆడానని రహానే గుర్తు చేశాడు. అయితే, ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదన్నాడు. టెస్టుల మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్నాడు. రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా నియమించడంపై రహానే మాట్లాడుతూ.. ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. రోహిత్ సారథ్యంపై సంతోషంగా ఉన్నానని, తన చేతుల్లో లేని వాటి గురించి తాను ఆలోచించబోనని రహానే పేర్కొన్నాడు.