Telugudesam: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిలు.. అర్ధరాత్రి దాటాక విడుదల

TDP MLC Ashok Babu Released On Bail

  • ఫేక్ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్
  • 18 గంటలపాటు సీఐడీ కస్టడీలోనే ఎమ్మెల్సీ
  • కేసుతో సంబంధం లేకుండా ప్రశ్నలు అడిగారన్న నేత
  • ఉద్యోగ సంఘాల నేతలు నలుగురు తనపై ప్రభుత్వానికి లేనిపోనివి ఎక్కించారని ఆరోపణ

ఫేక్ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు గత అర్ధరాత్రి బెయిలుపై విడుదలయ్యారు. మొన్న రాత్రి 11.30 గంటల సమయంలో అరెస్ట్ అయిన అశోక్‌బాబును సీఐడీ పోలీసులు దాదాపు 18 గంటలపాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అనంతరం విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సుదీర్ఘ విచారణ అనంతరం రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో ఇన్‌చార్జ్ న్యాయమూర్తి సత్యవతి బెయిలు మంజూరు చేయడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.20 గంటలకు అశోక్‌బాబు విడుదలయ్యారు.

బెయిలుపై విడుదలైన అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసుతో సంబంధం లేకుండా సీఐడీ పోలీసులు తనను ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల ఉద్యమంపై ఆరా తీసినట్టు చెప్పారు. తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన అరెస్ట్ రాజకీయ కక్షలో భాగమేనని అన్నారు.

ఉద్యోగ సంఘాలకు చెందిన నలుగురు నాయకులు ప్రభుత్వంతో రాజీపడి, ప్రభుత్వానికి తనపై లేనిపోనివి ఎక్కించి రెచ్చగొట్టారని అన్నారు. సీఐడీని ప్రభుత్వం పావుగా వాడుకుని తనపై అక్రమంగా కేసు బనాయించిందని, ఇలాంటి వాటికి తాను భయపడబోనని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

Telugudesam
MLC Ashok Babu
Andhra Pradesh
CID
  • Loading...

More Telugu News