Perni Nani: మోహన్ బాబు కాఫీకి పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను... సంజాయిషీ ఇవ్వడానికి కాదు: మంత్రి పేర్ని నాని

Perni Nani explains his meeting with Mohan Babu

  • పేర్ని నాని ప్రెస్ మీట్
  • సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం ఫలవంతం
  • సినీ ప్రముఖులు ఆనందంగా ఉన్నారన్న పేర్ని నాని
  • చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కానీ చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమ సంక్షేమం కోసం ఏనాడు పాటుపడని వ్యక్తి చంద్రబాబు అని, సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు ఫలవంతం కావడం పట్ల భరించలేకపోతున్నాడని విమర్శించారు.

సినిమా వాళ్లు తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆనందిస్తుంటే, చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. నిన్న సీఎంతో సమావేశానికి చంద్రబాబు కూడా ఏమైనా వచ్చారా? మహేశ్ బాబు కుర్చీ కిందో, ప్రభాస్ కుర్చీ కిందో దాక్కున్నారా? అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటల్లో ఈర్ష్య తప్ప మరొకటి కనిపించడంలేదన్నారు.

ఇక, హైదరాబాదులో తాను మోహన్ బాబు ఇంటికి వెళ్లింది స్నేహపూర్వకంగానే అని స్పష్టం చేశారు. మోహన్ బాబుతో తనకు 2002 నుంచి పరిచయం ఉందని, కాఫీకి పిలిస్తే మోహన్ బాబు ఇంటికి వెళ్లానని వెల్లడించారు. అంతేతప్ప ప్రభుత్వం తరఫున ఎవరికీ సంజాయిషీ ఇవ్వడానికి కాదని అన్నారు. తాను చెప్పిన తర్వాతే మంచు విష్ణు తన ట్వీట్ ను అప్ డేట్ చేశారని పేర్ని నాని వివరణ ఇచ్చారు.

మోహన్ బాబుతో సమావేశం సందర్భంగా వారి విద్యాసంస్థలు, ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నామని వెల్లడించారు. సీఎంతో సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని మోహన్ బాబు చెప్పారని, ఒకవేళ పిలిచి ఉంటే తప్పకుండా వచ్చేవాడ్నని కూడా ఆయన చెప్పారని పేర్ని నాని వివరించారు.

అంతకుముందు, టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సమస్యలు సృష్టించేది వారే, పరిష్కరించాం అని చెప్పేదీ వారేనని వ్యాఖ్యానించారు.

Perni Nani
Mohan Babu
Tollywood
CM Jagan
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News