Pakistan: పడవలతో గుజరాత్​ తీరంలోకి పాకిస్థానీల చొరబాటు.. 30 గంటలుగా ‘క్రీక్ క్రోకోడైల్ కమాండో’లతో గాలింపు

Pakistani Intrusion Into Gujarat coast
  • ఇప్పటికే 11 పడవలను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
  • ముగ్గురు మత్స్యకారులను అరెస్ట్ చేసినట్టు ప్రకటన
  • దాగివున్న పాకిస్థానీలు తప్పించుకోలేరన్న అధికారి
గుజరాత్ తీరంలోకి పాకిస్థానీలు చొరబడ్డారు. మత్స్యకారుల పడవల్లో భుజ్ లోని హరామీ నాలా వద్ద తీరంలోకి చొచ్చుకొచ్చారు. దీనికి సంబంధించి ముగ్గురు మత్స్యకారులను బీఎస్ ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 11 పడవలను సీజ్ చేశారు. మరికొంత మంది లోయ ప్రాంతంలో దాక్కున్నారని, వారి కోసం ప్రత్యేకమైన కమాండోలతో గాలింపు చేస్తున్నామని సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) ప్రకటన చేసింది.

ఇంకా ఎంత మంది చొరబడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, గాలింపు చర్యల కోసం వివిధ దిశలకు మూడు గ్రూపుల కమాండోలను వాయుసేన హెలికాప్టర్ల ద్వారా రంగంలోకి దించామని వెల్లడించింది. పాకిస్థానీలు దాక్కున్న చోటును కమాండోలు చుట్టుముట్టారని, అలలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడం, మడ అడవులుండడం వల్ల గాలింపు సవాల్ తో కూడుకుంటోందని తెలిపింది.

బుధవారం పాకిస్థాన్ మత్స్యకారులు చొరబడ్డారని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కమాండోలు స్వాధీనం చేసుకున్నారని, పాకిస్థానీలు తప్పించుకునే అవకాశమేలేదని స్పష్టం చేశారు. బుధవారం 8 పడవలు, గురువారం మరో 3 పడవలను సీజ్ చేశామన్నారు. 30 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు.

రణ్ ఆఫ్ కచ్ లో పెట్రోలింగ్, ఆపరేషనల్ డ్యూటీ కోసం బీఎస్ఎఫ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘క్రీక్ క్రోకోడైల్ కమాండో’లతో గాలింపు జరుపుతున్నామని చెప్పారు. కాగా, సెర్చ్ ఆపరేషన్ ను బీఎస్ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ ఐజీ జి.ఎస్. మాలిక్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Pakistan
Fishing Boats
Gujarath
Intrusion

More Telugu News