Andhra Pradesh: విశాఖపట్ణణంలో ట్రాఫిక్ ఆపేయడంపై సీఎం జగన్ సీరియస్.. విచారణ జరపాలంటూ డీజీపీకి ఆదేశం
- నిన్న విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన సీఎం
- మూడున్నరగంటలపాటు అక్కడే
- ఉన్నంతసేపూ ట్రాఫిక్ ను ఆపిన పోలీసులు
విశాఖపట్టణంలో ట్రాఫిక్ ఆపేయడం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న శారదాపీఠానికి సీఎం జగన్ వెళ్లిన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ను ఆపేశారు. శారదాపీఠంలో సీఎం ఉన్న మూడున్నరగంటలపాటు.. పరిసరప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాలు రోడ్డుపైనే ఇరుక్కుపోయాయి. దీంతో జనాలు ఇబ్బందులు పడ్డారు.
దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ను ఎందుకు నిలిపేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ జాంతో పాటు ప్రజలకు కలిగిన అసౌకర్యంపై దర్యాప్తు చేయాల్సిందిగా డీజీపీని ఆయన ఆదేశించారు.