trekker: రెండు రోజుల పాటు కొండ చీలికలో చిక్కుకున్న కేరళ యువకుడు.. కాపాడిన ఆర్మీ

fter two days trekker trapped in hill cleft in Kerala rescued by Army

  • మద్రాస్ రెజిమెంట్ నుంచి పర్వతారోహణ బృందం
  • బెంగళూరు నుంచి పారాచ్యూట్ బృందం
  • డ్రోన్ల సాయంతో బాబు జాడ గుర్తింపు
  • తొలుత ఆహారం, నీరు అందజేత

కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయిన కేరళ వాసి ఆర్మీ సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకుని ఆర్.బాబు (23) అనే యువకుడు, తన స్నేహితులతో కలసి గత సోమవారం వెళ్లాడు.

కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు తమ ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకున్నారు. కానీ, బాబు మాత్రం కొండపైకి చేరుకున్నాడు. తిరిగి వచ్చే క్రమంలో జారిపోయి రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు.

దీంతో సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. ఈ విషయం అతడి స్నేహితుల ద్వారా అధికారులకు తెలిసింది. కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు.

దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది..

సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి ఆహారం, నీరు అందించారు. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News