Malala Yousafzai: హిజాబ్ వివాదంపై స్పందించిన మలాలా యూసఫ్ జాయ్
- ఈ తీరు భయానకం
- స్త్రీల పట్ల వివక్ష
- ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దు
- ట్విట్టర్ లో పోస్ట్
ముఖానికి హిజాబ్ ధరించిన (ముఖాన్ని వస్త్రంతో కప్పుకోవడం) ముస్లిం విద్యార్థినులను కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం వివాదాస్పదం కావడంతో.. దీనిపై బాలల హక్కుల కార్యకర్త, పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించింది. హిజాబ్ తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్యగా పేర్కొంది.
యూనిఫామ్ తోనే అందరూ విద్యాలయాలకు రావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో దీనిపై వివాదం రగులుకుంది. ఉడిపి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కాలేజీలో ఆరుగురు విద్యార్థినులను హిజాబ్ తో అనుమతించని ఘటన తొలిసారి గత నెలలో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇదే అంశం కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకే కాకుండా, మధ్య ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకూ వ్యాపించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలకు మూడు రోజుల సెలవులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
మలాలా యూసఫ్ జాయ్ తన ట్విట్టర్ పేజీలో దీనిపై స్పందించారు. ‘‘బాలికలను హిజాబ్ తో స్కూల్ కు అనుమతించకపోవడం భయానకం. స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతోంది. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడడాన్ని భారత నాయకులు ఆపివేయాలి’’ అని మలాలా ట్వీట్ చేసింది.