Meghalaya: మేఘాలయలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్.. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార ఎండీఏలో చేరిక
- అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం కరవు
- ప్రధాన ప్రతిపక్షంగా టీఎంసీ
- ప్రజా ప్రయోజనాల కోసమే ఎండీఏకు మద్దతన్న ఎమ్మెల్యేలు
మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతిస్తున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది. ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 60 మంది సభ్యులున్న శాసనసభలో నవంబరు వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.
వారు టీఎంసీలో చేరడంతో మిగిలిన ఐదుగురు ఇప్పుడు ఎండీఏలో చేరారు. దీంతో మేఘాలయ అసెంబ్లీలో ఇప్పుడా పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ను వీడిన వారిలో శాసనసభా పక్ష నేత అంపరీన్ లింగ్డోతోపాటు పీటీ సాక్మీ, మేరల్‌బార్న్ సియెం, కింఫా మార్బానియంగ్, మొహేంద్రో రాప్సంగ్ ఉన్నారు. వీరంతా ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మాను కలిసి లేఖ అందించారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్‌లో చేరాలని నిర్ణయించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఇదే లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పంపించారు. తాము అధికార కూటమిలో చేరినప్పటికీ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతామని సీఎల్పీ నేత అంపరీన్ లింగ్డో చెప్పడం గమనార్హం.