Chandrababu: ఉద్యోగులను సజ్జల బెదిరించారు: చంద్రబాబు ఆరోపణ

Chandrababu alleges Sajjala threatens employees
  • ప్రభుత్వంతో ఉద్యోగులకు కుదిరిన ఒప్పందం
  • సమ్మె విరమించిన ఉద్యోగ సంఘాలు 
  • టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోతపెట్టారన్న చంద్రబాబు
  • ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని స్పష్టీకరణ
మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చల అనంతరం ఉద్యోగుల సమ్మె పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే, ఉద్యోగుల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదన్న అభిప్రాయాలు కొన్ని రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు.

నాడు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. కరోనా పేరు చెప్పి ఏ రాష్ట్రం కూడా వేతనాల్లో కోతలు పెట్టలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ఇతర అంశాలపైనా చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అరికట్టాలని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. డిస్కంల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అమలులో ఉండగా రాజధాని భూముల తనఖా సరికాదని హితవు పలికారు. కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
Chandrababu
Sajjala Ramakrishna Reddy
Employees
Andhra Pradesh

More Telugu News