Lata Mangeshkar: గుండెని మెలేసే గొంతు.. ఆ స్వరానికి సాటి లేదు.. గానకోకిల లతా మంగేష్కర్ మరణంపై కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, నటుల సంతాపాలు
- బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లిన సచిన్ టెండూల్కర్
- ఆమె పాటు చిరస్థాయిగా నిలుస్తాయి: నిర్మలా సీతారామన్
- స్వర కోకిల గొంతు మూగబోయిందని తెలిసి షాకయ్యా: సోనియా గాంధీ
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: ఉద్ధవ్ ఠాక్రే
లతా మంగేష్కర్ మరణంతో రాజకీయ నాయకులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సోనూసూద్ వంటి బాలీవుడ్ స్టార్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. భారత సంగీత ప్రస్థానంలో ఓ తరం ముగిసిందంటూ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఎన్నో తరాలను పాటలతో పరవశింపజేసిన లతా మంగేష్కర్ ఇక లేరనే వార్త బాధిస్తోంది. ఆ పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. సంగీతం కోసమే ఆమె బతికారు. – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణ వార్త బాధించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క మ్యూజిక్ ప్రేమికుల మనసుల్లో ఆమె గొంతు మార్మోగుతూనే ఉంటుంది. – సాంస్కృతిక శాఖ
స్వర కోకిల సుమధురగానాల గొంతుక మూగబోయిందని తెలిసి షాకయ్యా. ఓ శకం ముగిసింది. గుండెని మెలేసే గొంతు, దేశభక్తి గేయాలు, లత దీదీ కష్టాల జీవితం ప్రతి ఒక్క తరానికీ ఆదర్శప్రాయం. ఆమె ఈ చివరి ప్రయాణానికి నా నివాళులు. – సోనియా గాంధీ
లతా మంగేష్కర్ చనిపోయారన్న చెడు వార్త వినాల్సి వచ్చింది. ఎన్నో దశాబ్దాల పాటు అందరికీ ఎంతో ఇష్టమైన గళంగా ఆమె గుర్తుండిపోతారు. ఆమె స్వరానికి మరణం లేదు. మనందరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. – రాహుల్ గాంధీ
ఆమె మరణ వార్త విని తన గుండె బద్దలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం. – మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
లతా మంగేష్కర్ చనిపోయారని తెలిసి చాలా బాధేసింది. ఆమె తన పాటల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. – మోహన్ లాల్
ఆమెలా ఎవరూ పాడలేరు. ఎవరూ సాటి రారు. ఆమె పాడిన పాటల్లో నటించినందుకు ఆనందంగా ఉంది. అదృష్టవంతురాలిని. – ఎంపీ, అలనాటి హీరోయిన్ హేమ మాలిని
లతాజీ ఎల్లప్పుడూ భారత్ కు గర్వకారణం. మా జీవితంలో ఆమె గొంతు ఎల్లప్పుడూ ఓ భాగమవుతుంది. – నటి జెనీలియా
తన ప్రేమ, గౌరవం, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆమెతోనే ఉంటాయి. – ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహ్మాన్
గాన కోకిలను భారత్ కోల్పోయింది.ఆమె మరణించినా వదిలివెళ్లిన ఈ వారసత్వం ఎప్పటికీ ఉంటుంది. – కాజల్ అగర్వాల్
లతా మంగేష్కర్ మరణ వార్త విని కన్నీళ్లు ఆగడం లేదు. ఓ నిజమైన కళాకారిణి – కంగనా రనౌత్