Sajjala Ramakrishna Reddy: సజ్జల కాళ్లపై పడి వేడుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
- తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
- రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు చేయాలని విన్నపం
- కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలన్న ఉద్యోగులు
ఏపీలో ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. దీంతో, వారిని నిలువరించేందుకు మంత్రుల కమిటీ, సీఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆందోళన కార్యక్రమాలకు ఈరోజే ముగింపు పలికేలా, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓ వైపు ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈరోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై పడ్డారు. స్టీరింగ్ కమిటీతో చర్చల కోసం ఆయన సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన కాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడ్డారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తాము పని చేస్తున్నామని... వారికి సమానంగా తమకు కూడా పీఆర్సీని అమలు చేయాలని కోరారు. తమ కనీస వేతనాన్ని రూ. 15 వేల నుంచి రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.