Balakrishna: అవసరమైతే జగన్ ను కలుస్తా.. ఇక్బాల్ సవాల్ కు సిద్ధం: బాలకృష్ణ
- శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా ప్రకటించాలి
- ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం వెనకున్న అంతరార్థం ఏమిటి?
- ఎన్టీఆర్ జిల్లా ప్రకటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి
శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉద్యమానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా మద్దతు ప్రకటించారు. నిన్న మౌనదీక్షను చేపట్టిన బాలయ్య... ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. దీని కోసం అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానని చెప్పారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వెనకున్న అంతరార్థం ఏమిటని బాలకృష్ణ ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు.
ప్రాంతీయ ద్వేషాలను తీసుకొచ్చేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ మీద ప్రేమతో జిల్లాను ఏర్పాటు చేయలేదని... ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే ఆయన పేరు మీద ఉన్న పథకాలను, అన్నా క్యాంటీన్లను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
సినిమా టికెట్ల వివాదంపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే సినీ పరిశ్రమలోని పెద్దలకు చెప్పానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి విషయంలో వివాదాలను సృష్టిస్తోందని బాలయ్య విమర్శించారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ కు తాను సిద్ధమని చెప్పారు.