Cricket: కుంబ్లేపై కోహ్లీదే పైచేయి.. ఇద్దరి మధ్య విభేదాలున్నాయి: టీమిండియా మాజీ మేనేజర్ షాకింగ్ కామెంట్లు
- కుంబ్లేని కోచ్ గా తప్పించినప్పటి వివరాల వెల్లడి
- ఆటగాళ్లకు తోడ్పాటునివ్వలేదని కోహ్లీ అసహనం
- డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ గంభీరమైన వాతావరణం
- ‘ఆన్ బోర్డ్: టెస్ట్, ట్రయల్, ట్రయంఫ్’ పేరిట బుక్
2017లో అనిల్ కుంబ్లేని జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. ఆ ఏడాది నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఓడిపోవడంతో అతనిని తప్పించేశారు. అయితే, కోహ్లీ, కుంబ్లేకి పొసగలేదని, అందుకే తప్పించారన్న కథనాలు అప్పుడు కలకలం రేపాయి.
ఆ కథనాలకు బలం చేకూర్చేలా టీమిండియా మాజీ మేనేజర్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2017లో టీమిండియాకు మేనేజర్ గా పనిచేసిన రత్నాకర్ శెట్టి ఆ వ్యవహారంపై నోరు విప్పాడు. ‘ఆన్ బోర్డ్: టెస్ట్, ట్రయల్, ట్రయంఫ్. మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’ పేరిట తాను రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
కుంబ్లే, కోహ్లీ మధ్య విభేదాలున్నాయని, కుంబ్లేపైన కోహ్లీదే పైచేయి అని పేర్కొన్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ తర్వాత కుంబ్లేని తీసేయాలంటూ చాలా మంది కోరుకున్నారని వివరించాడు. జట్టులోని ఆటగాళ్లకు కుంబ్లే ఏనాడూ తోడ్పాటునివ్వలేదని కోహ్లీ భావిస్తుంటాడని చెప్పాడు. అదే ఇద్దరి మధ్యా అగాథాన్ని పెంచిందని తెలిపాడు. దీంతో డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ గంభీరమైన వాతావరణం ఉండేదన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు లండన్ లో ఓ సమావేశం జరిగిందని, దానికి విరాట్, అనిల్ కుంబ్లేతో పాటు జోహ్లీ, అమితాబ్ చౌదరి, డాక్టర్ శ్రీధర్ వంటి బీసీసీఐ అధికారులు హాజరయ్యారని, ఆ సమావేశంలో బహిరంగంగానే కుంబ్లేపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడని గుర్తు చేశాడు.