Jagan: ఏపీ సీఎం జగన్‌తో మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంపై చర్చ
- ఉద్యోగులను శాంతింపజేసేలా నిర్ణయాలు?
- పీఆర్సీలో కొన్ని సవరణలు.. జగన్ అంగీకారం
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర మంత్రులతో మరోసారి కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరై పలు అంశాలపై వివరిస్తున్నారు.
ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండడం, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననుండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి దాటేవరకు మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి నాయకులతో చర్చించింది. ఆయా అంశాలను మంత్రుల కమిటీ సీఎం జగన్‌కు వివరిస్తోంది. పీఆర్సీలో కొన్ని సవరణలు చేయడానికి జగన్ ఇప్పటికే ఒప్పుకున్నారు. దీంతో ఈ రోజు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం కానుంది.