professor: తెలుగు వ్యక్తికి అత్యున్నత పదవి.. యూజీసీ చైర్మన్ గా మామిడాల నియామకం!
- ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు..
- ప్రస్తుతం జేఎన్ యూ వీసీ బాధ్యతల్లో
- నల్లగొండ జిల్లా ‘మామిడాల’ ఆయన స్వగ్రామం
- డిగ్రీ, పీజీ చదువు హైదరాబాద్ లో
ఓ తెలుగు వ్యక్తికి అత్యున్నత పదవి వరించింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) వైస్ చాన్స్ లర్ (వీసీ) గా పనిచేస్తున్న మామిడాల జగదీష్ కుమార్ ను యూజీసీ చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు రెండింటిలో ఏది ముందు అయితే అంతవరకూ ఆయన పదవీ కాలం కొనసాగుతుందని కేంద్ర విద్యా శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.
ప్రొఫెసర్ డీపీ సింగ్ పదవీ విరమణతో డిసెంబర్ 7 నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూసీజీ) చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల జగదీష్ కుమార్ స్వస్థలం. పాఠశాల విద్యను స్వగ్రామంతోపాటు మిర్యాలగూడలో పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి వివేకవర్ధిని కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు.
కెనడాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో ప్రొఫెసర్ గా చేరారు. తదుపరి ఢిల్లీ ఐఐటీకి బదిలీ అయ్యారు. ఆ తర్వాత జేఎన్ యూ ప్రొఫెసర్ గా, 2016లో వీసీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో యూజీసీ చైర్మన్ పదవిని ఇద్దరు తెలుగు వారు అలంకరించారు. ఏపీలోని తెనాలికి చెందిన వీఎస్ కృష్ణ, కరీంనగర్ కు చెందిన జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్ గా పనిచేశారు.