Vijayawada: జ్వరమొస్తే 'ఆర్ఎంపీ' వద్దకు వెళ్లాలట.. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద బోర్డు ఏర్పాటు
- అనవసరంగా భయపడి ఆసుపత్రికి రావొద్దని వినతి
- ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీలేక రోగులు చనిపోతున్నారని బోర్డు
- తనకు తెలియదన్న ఆసుపత్రి సూపరింటెండెంట్
ప్రస్తుత కాలం ఏమంత బాగాలేదు. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా అది దేనికి దారితీస్తుందో తెలియక జనం హడలిపోతున్నారు. కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ఇవి. దీంతో ఏ చిన్న విషయానికైనా ప్రైవేటు ఆసుపత్రులకో, పెద్దాసుపత్రులకో వెళ్తున్నారు. ఫీజుల పేరుతో అక్కడ బాదుడు సరేసరి.
ప్రజల పరిస్థితి ఇలా ఉంటే మీకు దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా పొలోమంటూ ఆసుపత్రికి రావొద్దని, దగ్గరలోనే ఉన్నే ఆర్‌ఎంపీ వద్దకో, లేదంటే స్థానికంగా ఉండే ఏదో ఒక క్లినిక్ వద్దకో వెళ్లాలంటూ విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పెద్ద బోర్డు ఏర్పాటు చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది.
జ్వరం, దగ్గు, నీరసం వంటివి ఉంటే అనవసరంగా భయపడి పోయి వెంటనే ఆసుపత్రికి రావొద్దన్నది ఆ బోర్డు సారాంశం. పెద్దాసుపత్రులకు వెళ్తే అక్కడ బెడ్స్ ఖాళీలేక రోగులు చనిపోతున్నారని, కాబట్టి ఆర్‌ఎంపీ వద్దకో లేదంటే స్థానిక క్లినిక్‌లోనో చూపించుకోవాలని రోగులకు విజ్ఞప్తి చేస్తూ ఆ బోర్డును ఏర్పాటు చేశారు. ఇది చూసిన రోగులు అవాక్కవుతున్నారు. ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పే వైద్యులే స్వయంగా ఇంత పెద్ద బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం బోర్డు ఏర్పాటు గురించి తన తెలియదని చెబుతున్నారు.