Andhra Pradesh: కాపుల కోసం ప్రభుత్వం మంచి జీవో ఇస్తే పవన్ కల్యాణ్ కు స్పందించే మనసు రాలేదు: కాపు కార్పొరేషన్ చైర్మన్ విమర్శ
- కాపు ఉద్యమ కేసులను ఎత్తేసిన జగన్ సర్కారు
- ఆయన చిత్రపటానికి కాపు కార్పొరేషన్ నేతల క్షీరాభిషేకం
- ఇలాంటి వాటికీ స్పందించాలని పవన్ కు హితవు
- జగన్ ను బాధపెట్టడం భావ్యం కాదంటూ వ్యాఖ్య
రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తునిలో రైలు దహనం ఘటనకు సంబంధించి కాపు నేతలపై పెట్టిన కేసులను ఎత్తేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేసుల ఎత్తివేతకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కాపు సంఘాల నేతలు విజయవాడలో క్షీరాభిషేకం చేశారు.
సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చారని అడపా శేషు అన్నారు. రైలు ఘటనకు సంబంధించిన కేసులన్నీ ఎత్తేశారన్నారు. పవన్ కల్యాణ్ కేవలం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ కే స్పందిస్తున్నారని, కాపులకు సంబంధించి ప్రభుత్వం మంచి జీవో ఇచ్చినా స్పందించే మనసు రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి వాటిపైనా స్పందించాలన్నారు.
చెప్పింది చేయడం జగన్ నైజమని, అది ప్రపంచానికి తెలిసిన సత్యమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తీరు మార్చుకోకుంటే ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. కాపులకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని, కుల, మత ప్రాంత, జాతి భేదాలు లేని సీఎంను బాధపెట్టడం భావ్యం కాదని శేషు అన్నారు.