Andhra Pradesh: ఏపీలో భూముల విలువ పెంపు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
- ఇప్పటికే కొన్ని చోట్ల ధరల పెంపు
- గత ఏడాదే సవరించిన ప్రభుత్వం
- కరోనా కారణంగా అమలు వాయిదా
- విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ చార్జీల భారం
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాత విలువలను సవరించేందుకు కసరత్తులు చేస్తోంది. పెంచిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచకపోయినా.. భూముల మార్కెట్ విలువ పెరిగితే దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్ చార్జీలు భారం కానున్నాయి.
వాస్తవానికి ప్రతి రెండేళ్లకోసారి పట్టణాలు, గ్రామాలను గ్రిడ్లుగా విభజించి ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరిస్తోంది. గత ఏడాది ఆగస్టులో విలువలను సవరించినా.. ప్రజలు, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం వాటి అమలు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా పాత విలువలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఇటీవల జిల్లాలుగా ప్రకటించిన బాపట్ల, నరసరావుపేట పరిధిలోని 20 గ్రామాల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచే కొత్త విలువలు అమల్లోకి వచ్చాయి. అక్కడ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించి ముందుగానే ధరలను పెంచినట్టు తెలుస్తోంది.
నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు 100 శాతం పెరిగాయి. ఈస్ట్ బాపట్ల, వెస్ట్ బాపట్ల, మరుప్రోలువారిపాలెం, గణపవరం, అడవి, అప్పికట్ల, ఈతేరు, కర్రపాలెం, మురుకొండపాడుల్లో రేట్లను పెంచారు. బాపట్ల పట్టణంలో గజం భూమి విలువను రూ.2,100 నుంచి రూ.3 వేలకు పెంచారు. కొన్నిచోట్ల మొన్నటిదాకా రూ.5.25 లక్షలుగా ఉన్న ఎకరా భూమి.. ఇప్పుడు రూ.7 లక్షలకు పెరిగింది.
తెనాలి పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోనూ ధరలు పెరిగాయి. నరసరావుపేటకు సమీపంలోని రావిపాడు తప్ప మిగతా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల ధరలను పెంచారు. ఇప్పటిదాకా గజం విలువ రూ.1,800గా ఉండగా.. రూ.3 వేలకు పెంచేశారు . రావిపాడులో ఏకంగా రూ.5 వేలదాకా వెళ్లింది. కాగా, భూముల విలువ పెరుగుదలతో ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెరిగాయి.