Sameer Sharma: జీతాలు తగ్గింది ఎక్కడ?... చెబితేనే కదా మాకు తెలిసేది: ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ
- ఉద్యోగుల ఆందోళనలపై సీఎం జగన్ తో సీఎస్ భేటీ
- అనంతరం మీడియాతో మాట్లాడిన సమీర్ శర్మ
- పే స్లిప్ లో 10 అంశాలు ఉన్నట్టు వెల్లడి
- జీతం పెరిగిందని వివరణ
ఉద్యోగుల ఆందోళనలు, ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో సీఎం జగన్ తో భేటీ అనంతరం సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. జీతాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, జీతాలు ఎక్కడ తగ్గాయో చెప్పాలని అన్నారు.
ఏదైనా సమస్య ఉంటే చెబితేనే కదా తెలిసేది అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పే స్లిప్ లో 10 రకాల అంశాలు పొందుపరిచామని, అన్నింటిని పరిశీలిస్తే జీతం పెరిగిన విషయం వెల్లడవుతుందని తెలిపారు. సందేహాలుంటే పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చిచూసుకోవచ్చని అన్నారు.
ఇక, హెచ్ఆర్ఏపై సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలని సీఎస్ సూచించారు. తెలంగాణ తరహాలో కాకుండా తాము డీఏకి బదులు ఐఆర్ ఇచ్చామని వెల్లడించారు. తెలంగాణ మాదిరే డీఏ ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేవని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులు సానుకూల ధోరణితో ఆలోచించి సమ్మెకు వెళ్లకుండా చర్చలకు రావాలని సీఎస్ పిలుపునిచ్చారు. సమ్మె పరస్పర నష్టదాయకం అని, దాని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు.