K Kavitha: కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి నిర్మలా సీతారామన్ గారు: కవిత
- లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?
- దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు
- ఉద్యోగాలు కోల్పోయే బిడ్డల పరిస్థితి ఏంటన్న కవిత
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
'ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఇప్పుడు ఎల్ఐసీని అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని లాభాల్లో ఉన్న సంస్థను సిగ్గు లేకుండా అమ్ముతున్నారు. బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. అంత మంచి సంస్థను ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలి' అని సీఎం కేసీఆర్ మొన్న ప్రశ్నిస్తుండగా తీసిన వీడియోను కవిత పోస్ట్ చేశారు.
'కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ నిర్మలా సీతారామన్ గారు.. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీని అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటి?' అని కల్వకుంట్ల కవిత నిలదీశారు.